: ప్రతి పొలానికి నీరు...గ్రామానికి రోడ్డు: మోదీ


దేశంలోని ప్రతి వ్యవసాయ భూమికి నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. బడ్జెట్ సమావేశాల అనంతరం ఆయన మాట్లాడుతూ, 2019 నాటికి దేశంలోని ప్రతి గ్రామానికి రోడ్డు వేస్తామని అన్నారు. గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని ఆయన చెప్పారు. అలాగే 2018 నాటికి దేశంలోని ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. బడ్జెట్లో ఈ మేరకు కేటాయింపులు జరిగాయని ఆయన అన్నారు. బీపీఎల్ కుటుంబాల్లో పొగ బారినపడి ఎంతో మంది అనారోగ్యానికి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేశామని ఆయన చెప్పారు. రిటైర్మెంట్ తరువాత సైనికులంతా 'ఒన్ ర్యాంక్ ఒన్ పెన్షన్' అందుకుని అందరూ సురక్షితంగా ఉండాలని ఆ విధానం అమలు చేశామని ఆయన తెలిపారు. యువభారత్ మరింత దూసుకెళ్లేందుకు నైపుణ్య శిక్షణ అందించనున్నామని ఆయన చెప్పారు. పారిశ్రామిక వేత్తలుగా మారేందుకు స్టార్టప్స్ ప్రారంభిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రోజ్ గార్ యోజన ద్వారా మరిన్ని సౌకర్యాలు అందజేస్తున్నామని ఆయన చెప్పారు. విద్యావ్యవస్థలో స్టాండర్డ్స్ పెంచేందుకు గ్రూపులు ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా అందరూ మరింత బాగా చదువుకునేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. అందరికీ ఒకే రకమైన ఫలాలు అందే దిశగా బడ్జెట్ లో కేటాయింపులు చేశామని ఆయన చెప్పారు. ఈ బడ్జెట్ రూపకల్పనలో శ్రమ పడిన అరుణ్ జైట్లీని ఆయన ప్రశంసించారు. బడ్జెట్ లో సామాన్య ప్రజలకు పెద్దపీట వేశామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News