: ప్రయాణించినా, బయటికెళ్లి తిన్నా, ఆఖరికి ఫోన్లో మాట్లాడినా అదనపు బాదుడే!
ప్రజలపై పడ్డ అదనపు సుంకాలతో వివిధ సేవలపై అదనంగా చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 'కృషి కల్యాణ్' పేరిట కొత్త పన్నును ప్రవేశపెట్టిన మోదీ సర్కారు, జూన్ 1 నుంచి వివిధ సేవలపై ఈ పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది. దీనికితోడు స్వచ్ఛ భారత్ సెస్ ను 0.5 శాతానికి పెంచింది. ఈ నిర్ణయాలతో 14 శాతంగా ఉన్న సేవా పన్ను (విద్యా సెస్ తో కలిపి) 14.5 శాతానికి చేరింది. దీంతో వ్యాపార ప్రకటనలు, విమాన ప్రయాణాలు, ఆర్కిటెక్ట్ సేవలు, గృహ నిర్మాణం, క్రెడిట్ కార్డుల వాడకం, ఈవెంట్ మేనేజ్ మెంట్ తదితర సేవలు భారం కానున్నాయి. దీంతో పాటు టెలికం రంగం నుంచి అందుకునే సేవలపైనా భారం పడనుంది. ఫోన్ కాల్స్ కు అధిక బిల్లులు ఇచ్చుకోవాలి. హోటల్ బిల్లులు భారం అవుతాయి. దాదాపు అన్ని రకాల సేవలపైనా ఈ కొత్త పన్నుల భారం పడనుంది. కేవలం వైద్య సేవల రంగం వంటి అతి కొన్ని విభాగాలకు మాత్రమే ఈ కొత్త పన్ను భారం ఉండదు.