: కేజ్రీ కారుపై దాడి... కర్రలు, రాళ్లతో విరుచుకుపడ్డ దుండగులు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై కొద్దిసేపటి క్రితం దాడి జరిగింది. పంజాబ్ లో పర్యటిస్తున్న ఆయనపై లూధియానా జిల్లాలో నేటి ఉదయం భీకర దాడి జరిగింది. కర్రలు, రాళ్లు చేతబట్టిన గుర్తు తెలియని దుండగులు కేజ్రీ కారుపై విరుచుకుపడ్డారు. పెద్ద పెద్ద రాళ్లు పడటంతో కేజ్రీ కారు ముందు అద్దాలు పగిలిపోయాయి. అయితే కేజ్రీ మాత్రం ఎలాంటి గాయాలు కాకుండానే బయటపడ్డారు. ఈ దాడిపై స్వయంగా కేజ్రీనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ‘‘లూధియానాలో నా కారుపై కర్రలు, రాళ్లతో దాడి జరిగింది. కారు ముందు గ్లాస్ పేన్ పగిలిపోయింది. నా పర్యటనపై బాదల్ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ అసహనంతో ఉన్నాయి. అయితే, ఎన్ని దాడులు చేసిన నా ఆశయాన్ని మాత్రం భగ్నం చేయలేవు’’ అని కేజ్రీ ట్వీటారు. ఇక ఆప్ నేత ఆశిష్ ఖేతన్ కూడా వెనువెంటనే స్పందించారు. ‘‘కేజ్రీవాల్ ను తీవ్రంగా గాయపరిచేందుకు దుండగులు అతి సమీపంలోకి వచ్చారు. అయితే దేవుడి దయ వల్ల కేజ్రీకి ఎలాంటి గాయాలు కాలేదు’’ అని ఖేతన్ పేర్కొన్నారు. పంజాబ్ పర్యటనలో ఉన్న కేజ్రీకి ముప్పు ఉందంటూ ఢిల్లీ పోలీసులు పంజాబ్ పోలీసులను అప్రమత్తం చేసిన నాలుగు రోజుల్లోనే ఈ దాడి చోటుచేసుకోవడం గమనార్హం.