: 'శివోహం... శివోహం'... శివారాధన సమయం!
లయకారకుడు పరమశివుని మహా వేడుకలకు సమయం ఆసన్నమైంది. మాఘమాసపు శుభవేళ బహుళ త్రయోదశిని మహా శివరాత్రిగా పాటిస్తూ, భక్తి శ్రద్ధలతో దేవదేవుని కొలిచేందుకు భక్తులు సిద్ధమయ్యారు. నేటి నుంచి అన్ని ప్రముఖ శివాలయాల్లో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. శ్రీశైలం, కాశీ, శ్రీకాళహస్తి తదితర పుణ్యక్షేత్రాలన్నింటిలో ఈ ఉదయం ప్రత్యేక పూజలతో శివరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఈ నెల 10వ తేదీ వరకూ 11 రోజుల పాటు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ ఉదయం 9 గంటల సమయంలో గణపతి పూజ, యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభం కాగా, పెద్దసంఖ్యలో భక్తులు స్వామివారిని సందర్శించుకున్నారు. 7న కల్యాణం, 8న రథోత్సవం, 9న పూర్ణాహుతి, 10న అశ్వవాహన, శయనోత్సవ సేవలు వైభవంగా జరగనున్నాయి. ఇక 4న ఏపీ ప్రభుత్వం మల్లికార్జునుడికి పట్టు వస్త్రాలు సమర్పించనుండగా, అదే రోజున తిరుమల శ్రీవెంకటేశ్వరుడి తరపున టీటీడీ అధికారులు స్వామివారిని సత్కరించనున్నారు. రాష్ట్రంలోని అన్ని శివాలయాల్లో శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.