: జగన్ ప్రోగ్రాముల్లో రోజాకు రికార్డింగ్ డ్యాన్సులే!... ఆనం వివేకా సంచలన వ్యాఖ్యలు
ఏపీలో విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సొంత జిల్లా నెల్లూరులో మీడియాతో మాట్లాడిన సందర్భంగా సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. జగన్ ను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంగా ‘‘మగతనం, రోషం లేక వైసీపీ అధినేత జగన్ జబర్దస్త్ రోజాను టీడీపీపైకి వదిలారు’’ అంటూ ఆనం వ్యాఖ్యానించారు. ఆ తర్వాత రోజాపై అటాక్ ప్రారంభించిన ఆయన పరుష పదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. ‘‘గతంలో సినిమాల్లో రాణించావు. ఇప్పుడు సినిమాలు లేవు. టీవీలకే పరిమితమయ్యావు. రాబోయే రోజుల్లో జగన్ ప్రోగ్రాముల్లో రికార్డింగ్ డ్యాన్స్ లకే పరిమితమవుతావ్’’ అని అన్నారు. అంతటితో ఆగని ఆనం ‘‘వైసీపీ పతనానికి నీ ఒక్క పాదమే చాలమ్మా రోజమ్మా’’ అంటూ సెటైర్లు సంధించారు. ‘‘లేడీ బాస్ లాగా టీడీపీ నేతలపైకి రోజా వస్తున్నారు. రాజకీయాల్లో వెకిలి చేష్టలు సరికాదమ్మా... రోజమ్మా’’ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫేస్ వ్యాల్యూ గురించి రోజా మాట్లాడుతున్నారని, జగన్ కు ఫేస్ వ్యాల్యూ లేనందునే ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ టీడీపీలోకి వచ్చారని కూడా ఆనం అన్నారు. ‘‘రోజాకు మేకప్ లు... వైసీపీకి పేకప్ లు.... జగన్ కు లాకప్ లు తప్పవు’’ అని ఆయన భవిష్యవాణి వినిపించారు. ‘‘తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్ల రూపాయల అక్రమార్జనకు పాల్పడ్డ జగన్ ను చూసి లోకేశ్ నేర్చుకోవాలా?’’ అంటూ రోజా కామెంట్లపై ఆనం విరుచుకుపడ్డారు.