: షార్ట్ ఫిల్మ్ 'హీరో'గా కేసీఆర్ మనవడు!
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమ నేతగా ఉన్న సమయంలో అంతగా కనిపించని ఆయన మనవడు (కేటీఆర్ కొడుకు) హిమాన్షురావు తదనంతర కాలంలో తన తాత సీఎం అయ్యాక, ఆయనతో పాటు ఎక్కువగా కనిపిస్తున్నాడు. గతేడాది వినాయకచవితిని పురస్కరించుకుని ఖైరతాబాదులో ఏర్పాటు చేసిన భారీ గణనాథుడి విగ్రహం ప్రతిష్ఠాపన సందర్భంగా హిమాన్షు ఒక్కసారిగా సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. మొన్నటి అయుత మహా చండీయాగంలోనూ ఆ బుడతడు అందరి నోటా నానాడు. ఇటీవల కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సందర్భంగా... ఏకంగా స్నేహితులను వెంటేసుకుని సచివాలయంలోని తన తాత ఛాంబర్ తో పాటు అధికారుల కేబిన్లను పరిశీలించాడు. తాజాగా అతడు సిల్వర్ స్క్రీన్ పైనా తళుక్కుమననున్నాడు. అది కూడా హీరోగా! వివరాల్లోకెళితే... సమాజంలోని దురాగతాలపై ప్రజలను జాగృతం చేసేందుకు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్ డబ్ల్యూటీఓ) ‘సూపర్ హార్ట్’ పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆరు నుంచి పది నిమిషాల నిడివి ఉండబోతున్న ఈ షార్ట్ ఫిల్మ్ లో ఏసియన్ స్ట్రాంగ్ మ్యాన్ గా పేరుగాంచిన మనోజ్ చోప్రా విలన్ గా నటిస్తుండగా, వివిధ దేశాలకు చెందిన ఏడుగురు చిన్నారులు హీరోలుగా నటిస్తున్నారు. ఈ ఏడు హీరో పాత్రల్లో ఓ పాత్రకు హిమాన్షు ఎంపికయ్యాడు. యూఎన్ డబ్ల్యూటీఓ షార్ట్ ఫిల్మ్ ఉత్సవంలో భాగంగా నిన్న హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ చిత్ర నిర్మాణం లాంఛనంగా ప్రారంభమైంది. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారితో పాటు తెలంగాణ పిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్, మనోజ్ చోప్రా తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉన్న హిమాన్షు... స్వల్ప అనారోగ్యం కారణంగా గైర్హాజరైనట్లు సమాచారం. వచ్చే నెల 22 నుంచి జరిగే చిత్ర నిర్మాణంలో హిమాన్షు పాల్గొననున్నాడు. ఈ చిత్రంలో సూపర్ మ్యాన్ తరహా ఫైట్లు ఉండనున్నట్లు సమాచారం.