: భూమా నాగిరెడ్డి ప్యాకేజీలకు అమ్ముడుపోయే వ్యక్తి కాదు: భూమా అఖిలప్రియ
భూమా నాగిరెడ్డి ప్యాకేజీలకు అమ్ముడుపోయే వ్యక్తి కాదని ఆయన కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. హైదరాబాదులో ఓ టీవీ ఛానెల్ తో ఆమె మాట్లాడుతూ, భూమా కుటుంబం ప్యాకేజీలకు లేక పదవులకు అమ్ముడుపోతే 20 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండేది కాదని అన్నారు. 20 ఏళ్లు నియోజకవర్గంలో విజయం సాధించినప్పటికీ చేయాల్సింది ఎంతో ఉందని, ప్రతిపక్షంలో ఉన్నప్పటి కంటే, అధికారపక్షంలో ఉండగా చేసే పనుల సంఖ్య పెరుగుతుందని ఆమె చెప్పారు. పార్టీ మారడం అన్నది తన తండ్రి, తాను కలిసి తీసుకున్న నిర్ణయమని ఆమె తెలిపారు. పార్టీ మారుతున్న సంగతి కనీసం తన మామ ఎస్వీ మోహన్ రెడ్డికి కూడా చెప్పలేదని ఆమె అన్నారు. తప్పు చేశామని భావిస్తే తాము ముందుకు అడుగు వేయమని ఆమె పేర్కొన్నారు. తమది ఉమ్మడి కుటుంబం అని, వారసత్వం అందరికీ చెందుతుందని ఆమె తెలిపారు. తనకు ట్రావెలింగ్ ఇష్టమని చెప్పిన ఆమె, తన తమ్ముడు, చెల్లికి రాజకీయాలంటే బాగా ఇష్టమని అన్నారు. తన తల్లి తరువాత తాను రాజకీయాల్లోకి వచ్చానని, తన తల్లిని ఆదరించినట్టుగానే ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలు తననూ ఆదరిస్తున్నారని ఆమె చెప్పారు. వారికి ఏదయినా చేయాలన్న తపనతో ఉన్నానని ఆమె తెలిపారు.