: నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యం!: తెదేపాలో చేరిన అనంతరం డేవిడ్ రాజు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి మాత్రమే తాను తెలుగుదేశం పార్టీలో చేరానని ఎరగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు తెలిపారు. గతంలో దాదాపు 24 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేశానని, ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ గా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, సంతనూతలపాడు ఎమ్మెల్యేగా పనిచేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. కొన్ని వ్యక్తిగత కారణాలతో పార్టీని వదిలి నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి గెలిచానని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామని, రాజకీయాన్ని వదిలి నవ్యాంధ్ర నిర్మాణంలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని, దాన్ని గుర్తించే తిరిగి సొంత పార్టీలోకి వచ్చానని చెప్పారు. పగలనకా, రాత్రనకా అభివృద్ధికి పాటుపడుతున్న చంద్రబాబుకు అండగా ఉండటంతో పాటు నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని తెలిపారు. తనను చంద్రబాబు మనస్ఫూర్తిగా, ప్రేమగా అక్కున చేర్చుకున్నారని వివరించారు.