: శ్రీనగర్ కాలనీలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు... 23 మంది మందుబాబుల పట్టివేత
ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నా... భాగ్యనగరి హైదరాబాదులో మందుబాబుల ఆగడాలకు ఫుల్ స్టాప్ పడటం లేదు. వీకెండ్ లలో రాత్రి పొద్దుపోయేదాకా మద్యపానంలో మునిగితేలుతున్న నగర యువత, మద్యం మత్తులోనే రోడ్లపైకి వచ్చేస్తున్నారు. ఇలాంటి వారి వల్ల పెను ప్రమాదాలు తప్పవన్న భావనతో ఇటీవల పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న నగరంలోని శ్రీనగర్ కాలనీలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 23 మంది మందుబాబులు పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. నాలుగు కార్లు, 17 బైకులు, రెండు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకుని వాటిని నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. వీరందరికి సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం మంగళవారం కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు చెప్పారు.