: ‘ఓటుకు నోటు’ మత్తయ్య కోలుకున్నారు!... మరి, టీ ఏసీబీ విచారణకు వచ్చేనా?


తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య ఆరని చిచ్చు రగిల్చిన ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు(ఏ4)గా ఉన్న జెరూసలెం మత్తయ్య ఆరోగ్యం ఎట్టకేలకు కుదుట పడింది. ఇటీవలే కేసు దర్యాప్తులో భాగంగా తమ ముందు విచారణకు హాజరుకావాలంటూ టీ ఏసీబీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. దీంతో అనారోగ్యం పేరిట ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటలోని మదర్ థెరిస్సా ఆసుపత్రిలో జాయిన్ అయిన ఆయన అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. నిన్న ఆరోగ్యం కుదుటపడిన నేపథ్యంలో వైద్యులు ఆయనకు డిశ్చార్జ్ ఇచ్చారు. గతంలో ఓటుకు నోటు కేసులో ఆయన పేరును చేర్చిన వెంటనే ఏపీకి పరారైన ఆయన హైకోర్టులో ఊరట లభించేదాకా అక్కడే ఉండిపోయారు. మత్తయ్యను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు టీ ఏసీబీ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన తర్వాతే ఆయన హైదరాబాదులో అడుగుపెట్టారు. తాజాగా అలాంటి ఉత్తర్వులేమీ కోర్టు నుంచి జారీ కాలేదు. ఈ నేపథ్యంలో అనారోగ్యం పేరిట హైదరాబాదు వదిలి గుంటూరు జిల్లా చేరిన ఆయన మరి హైదరాబాదు ఎప్పుడు వస్తారో, టీ ఏసీబీ అధికారుల ముందు ఎప్పుడు హాజరవుతారో చూడాలి.

  • Loading...

More Telugu News