: టీడీపీ ఏపీలో బీజేపీని ఎదగనివ్వడం లేదు!: సినీనటుడు కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో బీజేపీని స్వతంత్రంగా ఎదగనీయకుండా టీడీపీ అడ్డుకుంటోందని, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం చేస్తున్న సాయాన్ని తమ ఘనతే అన్నట్లుగా టీడీపీ వ్యవహరిస్తోందని బీజేపీ నాయకుడు, ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజు విమర్శించారు. ఈరోజు భీమవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 6న తేదీన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో రాజమండ్రిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ బలాన్ని చాటేందుకు రాజమండ్రిని వేదికగా చేసుకోనున్నామన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం పలు రంగాల్లో వెనుకబడిపోయిందని కృష్ణంరాజు తెలిపారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ, ఏపీలో బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ తమ కార్యకర్తలను టీడీపీ నాయకులు వేధింపుల పాలు చేస్తున్నారని ఆరోపించారు.