: ఈవేళ అఫ్జల్ గురును సమర్థించే రాజకీయనేతలు చాలామంది ఆవేళ చనిపోయి వుండేవారు!... అఫ్జల్ కు ఉరి ఖరారు చేసిన జడ్జి సంచలన కామెంట్!
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ వర్సిటీలో చోటుచేసుకున్న రాద్ధాంతంపై పార్లమెంటు దాడి సూత్రధారి అఫ్జల్ గురుకు ఉరి శిక్షను ఖరారు చేసిన నాటి ప్రత్యేక న్యాయస్థానం జడ్జి (అనంతరం ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేశారు) ఎస్ఎన్ ధింగ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక 'పోటా' న్యాయస్థానం జడ్జిగా విధులు నిర్వర్తించిన ఆయన పార్లమెంటుపై జరిగిన దాడికి సంబంధించిన కేసు విచారణను చేపట్టారు. అన్ని వాదనలు విన్న ఆయన అఫ్జల్ గురుకు ఉరిశిక్షను ఖరారు చేశారు. అనంతరం ఆ శిక్షను హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఖరారు చేసిన నేపథ్యంలోనే అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు చేశారు. తాజాగా జేఎన్యూలో అఫ్జల్ గురు ఉరితీతను నిరసిస్తూ ఈ నెల 9న ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న కారణంగా వర్సీటీకి చెందిన ఆరుగురు విద్యార్థులపై రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. దీనిపై భగ్గుమన్న విపక్షాలు విద్యార్థులకు సంఘీభావంగా వర్సిటీలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతు పలికాయి. ఈ ఆందోళనలు, వాటికి రాజకీయ నేతల మద్దతుపై నేషనల్ న్యూస్ ఛానెల్ ‘ఎన్డీటీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జస్టిస్ ధింగ్రా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు ఆరోజు అఫ్జల్ గురు చేసిన దాడి సక్సెస్ అయ్యుంటే కనుక, ఇప్పుడు వీరికి మద్దతుగా మాట్లాడుతున్న రాజకీయ నేతల్లో చాలామంది ఆవేళ మరణించి ఉండేవారని వ్యాఖ్యానించారు. 'ఒకవేళ అప్పుడు వీరిలో నలభై, ఏభై మంది మరణించి వుంటే కనుక, ఈవేళ మన దేశంలో పరిస్థితి మరోలా వుండేది. అయితే, ఆవేళ కేవలం పదిహేను మంది సాధారణ పౌరులు చనిపోవడం వల్ల ఇప్పుడు అఫ్జల్ ను త్యాగమూర్తిగా భావించి ఆ రోజును సెలెబ్రేట్ చేసుకోవాలా?' అంటూ జస్టిస్ ధింగ్రా తీవ్రంగా మండిపడ్డారు. అఫ్జల్ గురుకు అమలైన ఉరి శిక్షను ‘జ్యూడీషియల్ కిల్లింగ్’గా కొందరు అభివర్ణించడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. సమాజానికి హాని చేసేవారిని ఉరేసే హక్కు రాజ్యాంగం న్యాయ వ్యవస్థకు కట్టబెట్టిందన్న వాస్తవాన్ని అందరూ గుర్తెరగాలని ఆయన వ్యాఖ్యానించారు.