: ఐఎస్, ఐఎస్ఐ ఏజెంట్లుగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్య


బీజేపీ నేత, జమ్మూ కాశ్మీర్ లోని నౌషెరా ఎమ్మెల్యే రవీంద్ర రైనా మరో వివాదానికి తెర తీశారు. జమ్మూ కాశ్మీర్ పోలీసు విభాగంలోని కొంతమంది పోలీసులు పాకిస్థాన్ గూఢచార సంస్థ ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)’తో పాటు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మీడియా ప్రతినిధులతో ఇటీవల మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు నిన్న ఆ రాష్ట్రానికి చెందిన లాంగతే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించిన షేక్ అబ్దుల్ రషీద్ సంచలన వీడియోను విడుదల చేశారు. ‘‘పోలీసులుగా విధులు నిర్వర్తిస్తున్న కొందరు వ్యక్తులు పాక్ అనుకూల శక్తులుగా వ్యవహరిస్తున్నారు. ఐఎస్ఐఎస్ తో పాటు ఐఎస్ఐ, ఉగ్రవాదులు, హఫీజ్ సయీద్, లష్కరే తోయిబా, జైషే మొహ్మద్ ల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. నౌషెరా, సుందర్బనీ, రాజౌరీ-పూంచ్ సెక్టార్లలో అశాంతికి కారణమవుతున్నారు’’ అని సదరు వీడియోలో రవీంద్ర వ్యాఖ్యానించారు. ఇక తనను హత్య చేస్తానని కూడా రవీంద్ర బెదిరించారని రషీద్ ఆరోపించారు. రవీంద్ర చేసిన వ్యాఖ్యలపై పోలీసులు స్పందించాలని రషీద్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News