: పాక్ కు 'ఎఫ్-16'ల బిల్లుకు అడ్డంకి!
అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యమున్న అత్యాధునిక యుద్ధ విమానాలను పాకిస్థాన్ కు విక్రయించాలన్న బిల్లును వ్యతిరేకిస్తూ, అమెరికా ప్రతినిధుల సభ ముందుకు సంయుక్త తీర్మానం వచ్చింది. ఎఫ్-16 ఫైటర్ జెట్ విమానాల్ని పాక్ కు విక్రయించడం ద్వారా ఆసియా రీజియన్ లో ముఖ్యంగా భారత ఉప ఖండంలో అశాంతికి బీజం వేసినట్లవుతుందని కాంగ్రెస్ ప్రతినిధి డానా రోహ్రాబచర్ వ్యాఖ్యానించారు. అమెరికా ఇచ్చే విమానాలతో పాక్ బెలూచిస్థాన్ ప్రజలపై దాడులకు దిగవచ్చని ఆయన అన్నారు. అమెరికాపై ఉగ్రదాడులు చేయించి పెను నష్టానికి కారకుడైన ఒసామా బిన్ లాడెన్ కు ఆశ్రయమిచ్చిన పాక్ కు ఆయుధ సాయం చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. కాగా, ఈ నెలారంభంలో 700 మిలియన్ డాలర్ల విలువైన డీల్ అమెరికా, పాకిస్థాన్ మధ్య కుదిరిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ శత్రుదేశమేకానీ, అమెరికాకు మిత్రదేశం కాదని ఆయన అన్నాడు.