: సజీవంగా పట్టుబడ్డ మరో ముష్కరుడు
పాకిస్థాన్ లోనే ఉగ్రవాదం పురుడు పోసుకుంటోందన్న భారత వాదనకు మరో బలమైన ఆధారం చిక్కింది. భారత సైన్యం, ఉగ్రవాదుల పీచమణచడంలో సత్తా చాటుతున్న రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ లో పాక్ కు చెందిన 17 ఏళ్ల ఫిదాయి సజీవంగా పట్టుబడ్డాడు. గతేడాది నవంబర్ 25న కుప్వారా జిల్లా పరిధిలోని తంగ్దార్ సమీపంలోని ఆర్మీ క్యాంపుపై దాడికి పాల్పడ్డ ఈ మైనర్ ఫిదాయిని మొహ్మద్ సాధిక్ గుజ్జార్ గా గుర్తించారు. పాకిస్థాన్ లోని సియాల్ కోట్ కు చెందిన గుజ్జార్ ను పఠాన్ కోట్ దాడికి సూత్రధారిగా వ్యవహరించిన మౌలానా మసూద్ అజార్ నేతృత్వంలోని ఉగ్రవాద సంస్థ జైషే మొహ్మద్ సభ్యుడిగా సైన్యం నిర్ధారించింది. మొత్తం నలుగురు ముష్కరుల కదలికలపై పక్కా సమాచారం అందుకున్న భారత బలగాలు జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా ప్రాంతంలో నిన్న ముప్పేట దాడికి దిగాయి. ఈ దాడిలో ముగ్గురు ముష్కరులు చనిపోగా, గుజ్జార్ సజీవంగా పట్టుబడ్డాడు. అరెస్ట్ సందర్భంగా అతడి వద్ద నుంచి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను సైన్యం స్వాధీనం చేసుకుంది.