: అమెరికాలో కాల్పుల కలకలం... తుపాకీతో దుండగుడి స్వైర విహారం, ముగ్గురి దుర్మరణం


అగ్రరాజ్యం అమెరికాలో కొద్దిసేపటి క్రితం మరోమారు కాల్పుల కలకలం చోటుచేసుకుంది. తుపాకీ చేతబట్టి రంగప్రవేశం చేసిన ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు దిగాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు పౌరులు అక్కడికక్కడే చనిపోగా, మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వివరాల్లోకెళితే... కన్సాస్ లోని హెస్టాన్ ఏరియా ఇండస్ట్రీ ప్రాంతంలోకి చొరబడ్డ ఓ దుండగుడు కనిపించిన వారిపై కాల్పులకు తెగబడ్డాడు. ఊహించని ఈ పరిణామానికి భయకంపితులైన అమెరికన్లు పరుగులు తీశారు. అయితే ఆ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో అప్పటికే ముగ్గురు వ్యక్తులు నేలకొరిగారు. 20 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెనువెంటనే రంగంలోకి దిగారు. దుండగుడిని మట్టుబెట్టేశారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాల్పులకు తెగబడ్డ దుండగుడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News