: మున్నాబాయికి ఈ రాత్రి సల్మాన్ ఫామ్ హౌస్ లో ఖరీదైన విందు
పూణెలోని యెరవాడ జైలు నుంచి గురువారం విడుదలైన బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కు మరో అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ భారీ స్థాయిలో పార్టీని ఏర్పాటు చేశాడు. మొదటి నుంచి సంజయ్ దత్ కు సల్మాన్ ఖాన్ బాసటగా నిలుస్తున్న విషయం అభిమానులకు గుర్తు ఉండే ఉంటుంది. పాన్వెల్ లోని తన ఫామ్ హౌస్ లో భారీ స్థాయిలో విందును ఏర్పాటు చేసిన సల్మాన్... సంజయ్ దత్ కుటుంబ సభ్యులతోపాటు బాలీవుడ్ కు చెందిన స్నేహితులను కూడా ఆహ్వానించాడు. ఈ రోజు పూణెలోని యెరవాడ జైలు నుంచి విడుదలైన అనంతరం సంజయ్ దత్ నేరుగా ముంబైకి చేరుకున్నాడు. విమానాశ్రయం వద్ద సంజయ్ కు ఆహ్వానం పలికి రోజంతా ఆయన వెన్నంటి ఉండేందుకు నలుగురు బాడీ గార్డులను కూడా సల్మాన్ పంపించాడు. ముందస్తుగా నిర్ణయించుకున్న పనులన్నింటినీ ముగించుకుని రాత్రికి సంజయ్ దత్ తన కుటుంబ సభ్యులతో కలసి పాన్వెల్ లోని ఫామ్ హౌస్ కు చేరుకుంటాడు. ఘనమైన విందులో భాగంగా సంజయ్ దత్ తో తగినంత సమయం గడిపిన అనంతరం సల్మాన్ హర్యానాలో జరగనున్న సుల్తాన్ షూటింగ్ కు వెళ్లనున్నాడు.