: రూ.70 లక్షల చేతి గడియారంపై పెదవి విప్పిన సిద్ధరామయ్య!


తన చేతికి ధరించిన 70 లక్షల రూపాయల గడియారంపై రాజకీయ, ఇతర వర్గాల నుంచి వెల్లువెత్తిన విమర్శలకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం స్పందించారు. అది తనకు బహుమతిగా వచ్చిందన్నారు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి రూ.70 లక్షల ఖరీదైన చేతి గడియారాన్ని ధరించడంపై రాజకీయ నాయకులు, సామాన్యులు సైతం విమర్శలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఎస్ భాస్కరన్ అనే సామాజిక కార్యకర్త లోకాయుక్తలో ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య గురువారం ఎట్టకేలకు పెదవి విప్పారు. ఆ చేతి గడియారం సెకండ్ హ్యాండ్ దని, తనకు బహుమతిగా వచ్చిందన్నారు. ‘నేను సాధారణ వ్యక్తిని. ఇదో సెకండ్ హ్యాండ్ వాచ్. బహుమతిగా వచ్చింది. దీనికి నేను పన్ను కడతాను’ అని ఆయన తెలిపారు. అంతేకాదు దీన్ని తాను ఉపయోగించనని, ప్రజల ఆస్తిగానే ఉంచుతానని అన్నారు. ఈ గడియారం విషయమై దర్యాప్తు చేయాలని తాను కస్టమ్స్ విభాగాన్ని కోరినట్టు బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి ఇప్పటికే బయటపెట్టిన విషయం తెలిసిందే. మాజీ సీఎం కుమారస్వామి ఈ గడియారం విలువను బయటపెట్టడం ద్వారా తొలిగా వివాదాన్ని రాజేశారు. అంతేకాదు దీన్ని ఎవరు బహూకరించారో కూడా తనకు తెలుసునని ఆయన ప్రకటించారు. దీంతో సీఎంపై భిన్న వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అయినా సీఎం సిద్ధరామయ్య ఇప్పటి వరకు మౌనం దాల్చి చివరికి వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News