: ఎక్కడా ఆగని 'ప్రభు' రైలు!
రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన 2016-17 రైల్వే బడ్జెట్ ఊరించి ఉసూరుమనిపించింది. ఎన్నో ఆశలతో ఎదురుచూసిన ప్రజలకు పైపై మెరుగులు తప్ప మరేమీ కనిపించలేదు. అటు పారిశ్రామిక వర్గాలకు సైతం అసంతృప్తినే కలిగించింది. సామాన్యులకు అంత్యోదయ ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రవేశపెడతామని, పుణ్యక్షేత్రాలకు కొత్త రైళ్లని, స్మార్ట్ బోగీలని, చార్జింగ్ పాయింట్లనీ, ఐవీఆర్ ఎస్ నంబర్లని, వైఫై అని... ఇలా టెక్నాలజీ చూపించారే తప్ప, ఓ రైలును పొడిగించడం, కొత్త రైళ్లను ప్రకటించడం, పాత ప్రాజెక్టులకు నిధుల మంజూరు వంటి విషయాల జోలికే పోలేదు. సంప్రదాయ పద్ధతులు వీడుతున్నానని ముందే చెప్పిన ఆయన, సాంకేతికను రైల్వేల్లో చొప్పిస్తామని చెప్పారే తప్పు, అందుకు ఎంచుకున్న మార్గాలను విశదీకరించలేదు. రూపాయి ఖర్చుతో ఐదు రూపాయల ఆదాయమన్నారే తప్ప, అదెలా సాధ్యమో వివరించలేదు. కేంద్రం అధీనంలో ఉన్న రైల్వే శాఖ, రాష్ట్రాలు నిధులిస్తే మరిన్ని ప్రాజెక్టులను చేపడతామంటూ చెప్పడం గమనార్హం. ఈ ప్రాజెక్టుల అనంతరం రైల్వేల్లో ఆదాయాన్ని రాష్ట్రాలు పంచమంటే..? ఆ ప్రస్తావనే ఆయన తేలేక పోయారు. వైఫై సేవలను అందించేందుకు మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు ముందుకు రాగా, దాన్ని ప్రభుత్వం అందించిన సౌకర్యంగా సురేష్ ప్రభు చెప్పుకున్నారు. పెట్టుబడుల కోసం పబ్లిక్ - ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టులు ఉంటాయని చెప్పిన ఆయన, రైల్వేల ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పకనే చెప్పినట్లయింది. ఆడిటింగ్ విధానంలో లీకేజీలు ఉన్నాయని ఒప్పుకున్న సురేష్ ప్రభు, అవినీతిని అరికట్టేందుకు తీసుకునే చర్యలపై స్పష్టమైన నిర్ణయాలు చెప్పలేకపోయారు. ఎటొచ్చీ ప్రజలపై చార్జీల భారం మోపకపోవడం ఒక్కటే ఈ బడ్జెట్ తరువాత సామాన్యుడికి కాస్త ఆనందం. ఏతావాతా, రైల్వే బడ్జెట్ ఏ రాష్ట్రానికీ ఏమీ ఇవ్వకుండానే వెళ్లిపోయినట్లయింది.