: లోకేశ్ పిచ్చి భ్రమలు నెరవేరవు!: రోజా ఎద్దేవా
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్న లోకేశ్, తెలంగాణలో తొడగొడితే, అక్కడ టీడీపీ ఖాళీ అయిందని, ఇక ఏపీలోనూ అదే పని చేస్తున్నాడని వైకాపా ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. ఈ ఉదయం తన భర్తతో కలసి అన్నవరానికి వచ్చిన ఆమె, సత్యదేవుని దర్శించుకుని స్వామివారి వ్రతం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పార్టీని వీడి వెళ్లిన నేతలతో వైకాపా బలహీనపడబోదని, కార్యకర్తల అండ ఉన్నంత కాలం తమకు ఎదురులేదని అన్నారు. వైకాపాను నాశనం చేస్తామంటున్న లోకేశ్ పిచ్చి భ్రమలు నెరవేరవని అన్నారు. ఫిరాయింపుదారులు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే తప్ప రాష్ట్రాభివృద్ధి కోసం వెళ్లలేదని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం నిత్యమూ పోరాడుతూ ఉన్న జగన్ వంటి వ్యక్తికి దూరం కావడం వాళ్ల దురదృష్టమని, వారి స్థానంలో కొత్త నేతలను తయారు చేసుకునే శక్తి వైకాపాకుందని తెలిపారు.