: సొంత జిల్లాలో జగన్ కు మరో షాక్... టీడీపీలో చేరిన బద్వేల్ ఎమ్మెల్యే తిరివీది జయరాములు


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తన సొంత జిల్లా కడపలోనే మరో షాక్ తగిలింది. రెండు రోజుల క్రితం వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ ‘సైకిల్’ ఎక్కగా, వారిలో కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి ఉన్నారు. తన సొంత జిల్లా నుంచే ఇద్దరు కీలక నేతలు టీడీపీలో చేరడం, తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న భూమా నాగిరెడ్డి కూతురుతో పాటు టీడీపీలో చేరడంతో జగన్ షాక్ తిన్నారు. తాజాగా కొద్దిసేపటి క్రితం కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే తిరివీది జయరాములు వైసీపీకి ఝలకిచ్చారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో విజయవాడలో జయరాములు సైకిలెక్కేశారు. తాజా పరిణామంతో మరింత మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం ఖాయమేనన్న వాదనకు మరింత బలం చేకూరింది. ఇదిలా ఉంటే, మరికాసేపట్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కడప జిల్లాలో అడుగుపెట్టనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన కడప జిల్లాకు వస్తున్నారు. లోకేశ్ కడప జిల్లా పర్యటనకు బయలుదేరిన సమయంలోనే జయరాములు టీడీపీలో చేరడంతో, లోకేశ్ కడప జిల్లా పర్యటన ముగిసేలోగా ఇంకెంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరతారోనన్న ఆసక్తికర వాదనకు తెర లేచింది.

  • Loading...

More Telugu News