: అప్పుకావాలా నాయనా? పది నిమిషాల్లో రూ. లక్ష వరకూ రుణమిచ్చే సరికొత్త యాప్!
డబ్బు అవసరమైన వేళ ఏదో ఒక రూపంలో అప్పు చేయాల్సిన అవసరం రావచ్చు. ఆ సమయంలో బ్యాంకుల చుట్టూ తిరిగేందుకు సమయం కేటాయించాలి. లేదంటే స్నేహితులు, బంధువుల దగ్గర చేయించాలి. వారి వద్ద ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఈ సమయంలో మిమ్మల్ని ఆదుకునేందుకు వచ్చిందే 'ఎర్లీ శాలరీ' యాప్. పూణే ఔత్సాహికుడు అక్షయ్ మెహరోత్రా మనసులో నుంచి పుట్టిన ఆలోచనే ఈ యాప్. ఆయన విజిటింగ్ కార్డుపై కూడా 'హలో, నేను అక్షయ్, డబ్బు అవసరమా?' అనే కనిపిస్తుంది. స్మార్ట్ ఫోన్ లో 'ఎర్లీ శాలరీ' యాప్ లోడ్ చేసుకుని రుణం కోసం రిక్వెస్ట్ పంపితే, నిబంధనలన్నీ పాటించే వారికి ఈ స్టార్టప్ సంస్థ నిమిషాల్లో రూ. లక్ష వరకూ రుణమిస్తుంది. కేవలం స్వల్పకాల రుణాలను మాత్రమే యాప్ అందిస్తుంది. ఇక రుణం కావాలంటే, యాప్ లోకి ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమ ఖాతా ద్వారా ప్రవేశించాలి. నెల వేతనం, ఎంత డబ్బు అవసరం? ఎప్పుడు తిరిగిస్తారు? వంటి ప్రశ్నలకు సమాధానం చెప్పిన తరువాత పాన్ (పర్మినెంట్ ఎకౌంట్ నంబర్), మూడు నెలల బ్యాంక్ స్టేట్ మెంట్లను అప్ లోడ్ చేయాలి. బ్యాంకు ఖాతా వివరాలు ఇచ్చిన పది నిమిషాల్లోనే మీకు డబ్బు క్రెడిట్ అవుతుంది. ఈ సంస్థ తన కస్టమర్లకు రుణాలిచ్చేందుకు ఇప్పటికే రూ. 10 కోట్లను సిద్ధం చేసింది. కనీస మొత్తంగా రూ. 10 వేల నుంచి రూ. 30 వేల వరకూ రుణమిస్తారు. 7 రోజుల నుంచి నెలలోగా రుణాన్ని తిరిగి చెల్లించాల్సి వుంటుంది. వడ్డీ రేటు తీసుకునే రుణాన్ని బట్టి 24 నుంచి 30 శాతం వరకూ ఉంటుంది. అంటే... సాధారణ క్రెడిట్ కార్డు వడ్డీ కన్నా తక్కువే. ఈ తరహా విధానం బ్రిటన్ లో విజయవంతమైందని, అందువల్లే దీన్ని భారత్ లోనూ ప్రవేశ పెట్టాలని భావిస్తున్నామని తెలిపారు. తమ యాప్ యువ ఐటీ ప్రొఫెషనల్స్ కు ఆర్థిక కష్టాలు తీర్చేందుకు సహకరిస్తుందని భావిస్తున్నట్టు మెహరోత్రా చెబుతున్నారు.