: పఠాన్ కోట్ దాడిపై పాక్ దర్యాప్తు షురూ!... అనుమానితుల పేరిట పలువురి అరెస్ట్
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి పాకిస్థాన్ ఎట్టకేలకు దర్యాప్తు ప్రారంభించింది. ఈ నెల 18న కేసు నమోదు చేసిన పాక్ దర్యాప్తు అధికారులు నిన్న ఆ దేశంలోని పంజాబ్ కు చెందిన పలు పట్టణాల్లో ముమ్మర సోదాలు నిర్వహించారు. పాక్ అంతర్గత మంత్రిత్వ శాఖ వర్గాలను ఉటంకిస్తూ ‘బీబీసీ ఉర్దూ’ ఈ మేరకు ఓ కథనాన్ని రాసింది. కేసు నమోదు చేసిన దాదాపు నాలుగు రోజుల తర్వాత సోదాల పేరిట బయటకొచ్చిన పాక్ అధికారులు పంజాబ్ లోని జీలం, సియాల్ కోట్, దినా, గుజ్రన్ వాలాలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో భాగంగా అనుమానితుల పేరిట పలువురు వ్యక్తులను పాక్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రహస్య స్థావరాలకు తరలించిన వారిని పఠాన్ కోట్ దాడికి సంబంధించి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, పఠాన్ కోట్ దాడికి తెగబడ్డ ఉగ్రవాదులు పాక్ లోని తమ వ్యూహకర్తలతో పాటు కుటుంబసభ్యులతో మాట్లాడారంటూ భారత్ అందజేసిన ఆధారాలను బయటకు తీసిన పాక్ అధికారులు ఆ దిశగానూ దర్యాప్తును వేగిరం చేశారు.