: చంద్రబాబు రాజకీయాన్ని ప్రజలు, దేవుడు చూస్తున్నారు: జగన్
చంద్రబాబు రాజకీయాన్ని ప్రజలు, దేవుడు చూస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత జగన్ చెప్పారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, వారిద్దరూ ఇచ్చే తీర్పు చంద్రబాబుకు గూబగుయ్యిమంటుందని అన్నారు. భూమా అన్న పార్టీ మారినప్పుడు చాలా బాధవేసిందని ఆయన చెప్పారు. శోభమ్మ హఠాన్మరణం తమ కుటుంబానికి బాధ కలిగించిందని, తమ కుటుంబం మొత్తం వెళ్లామని ఆయన గుర్తుచేసుకున్నారు. అలాంటి ఆయన మంత్రి పదవికి ప్రలోభపడడం బాధ కలిగించిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పార్టీలు మారిన వారిని తొలగించాలని మెమొరాండం ఇచ్చిన టీడీపీ, ఇప్పుడు తానే ఇలా చేయడం ఆ పార్టీ నైతికతను తేటతెల్లం చేస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్రపతిని కలిసి టీడీపీ తీరుతెన్నులను వివరించామని ఆయన చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై గత ప్రధాని చేసిన హామీని గుర్తు చేశామని ఆయన తెలిపారు.