: బస్సీ! నువ్వు ఐఎస్ఐ ఏజెంట్...కాదని నిరూపించుకో: ఢిల్లీ పోలీస్ బాస్ పై నెటిజన్ల ఆగ్రహం


ఢిల్లీ పోలీస్ కమిషనర్ పై సామాజిక మాధ్యమం ట్విట్టర్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీలోని జేఎన్ యూ ఘటనలో కన్నయ్య కుమార్ దేశవ్యతిరేక నినాదాలు చేయలేదని న్యాయస్థానానికి అందజేసిన నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. దీనిపై సామాజిక మాధ్యమాలలో నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలో జేఎన్ యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్ ను అరెస్టు చేసిన సందర్భంగా, దేశద్రోహం అభియోగంతో అరెస్టైన వారు నిర్దోషులైతే ఆ విషయాన్ని వారు నిరూపించుకోవాలని ఢిల్లీ పోలీస్ కమీషనర్ భీమ్ సేన్ బస్సీ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 'బస్సీ ఐఎస్ఐ ఏజెంట్ అని నేను అంటున్నాను...కాదని అతను నిరూపించుకోవాలి' అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. 'దోషిగా తేలేవరకు ప్రతి వ్యక్తి అమాయకుడేనని ఇండియన్ పీనల్ కోడ్ చెబుతోంది. నీ నిర్దోషిత్వానికి నా దగ్గర సాక్ష్యాలు లేవు కనుక నువ్వు ఐఎస్ఐ ఏజెంట్ వే' అని ఓ వ్యక్తి వ్యంగ్యోక్తి విసిరాడు. 'సీపీ పదవి పోగానే ఇంకో పదవి కోసం ఆరాటపడుతూ, విద్యార్థి నేతలను దోషులను చేశావు...వారికి ముందు క్షమాపణలు చెప్పుకో' అంటూ ఇంకో నెటిజన్ సూచించాడు. 'మరో జోక్ పేల్చినందుకు ధాంక్స్ బస్సీ' అంటూ ఇంకొక నెటిజన్, 'దేశంలో పౌరులంతా నేరస్థులేనని బస్సీ అభిప్రాయం. అందుకే అంతమందిని విచారించడం కష్టం కనుక, అమాయకులను నిర్దోషిత్వం నిరూపించుకోవాలని కోరుతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఢిల్లీ కమిషనర్ ను ఏకిపారేస్తున్నారు.

  • Loading...

More Telugu News