: రైతులు ఆనందించే రోజులు త్వరలోనే రానున్నాయి: ఉభయ సభలను ఉద్దేశించి ప్రణబ్ ముఖర్జీ


ఇండియాలో ప్రభుత్వం రైతులతో స్నేహపూర్వకంగా ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. వ్యవసాయంపై అధికంగా ఆధారపడ్డ దేశంగా, ఇండియా అభివృద్ధి పథంలో ముందంజ వేసేందుకు రైతుల సంక్షేమం కోసం తన ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ఈ ఉదయం పార్లమెంట్ ఉభయసభల్లో ఎంపీలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, రైతన్న ఆనందించే రోజు త్వరలోనే రానుందని అన్నారు. "ప్రధానమంత్రి సోషల్ బీమా యోజనను ప్రకటించడం ద్వారా నా ప్రభుత్వం పంటల బీమాను రైతుల దరికి చేర్చింది. దీని ద్వారా దురదృష్టవశాత్తూ అతివృష్టి, అనావృష్టి ఏర్పడి పంటలను నష్టపోయినప్పటికీ, రైతులకు ఇబ్బందులు ఏర్పడవు. రైతులు అధునాతన సాంకేతికను వినియోగించుకుని మరింత దిగుబడి సాధించేలా చర్యలు చేపట్టాం. రైతుల బీమా పొందేందుకు అర్హతలనూ సవరించాం. భూసార పరీక్షలు పెద్దఎత్తున జరిపిస్తూ, ఏ ప్రాంతంలో ఎటువంటి పంటలు బాగా పండుతాయో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. పరంపరాగత్, కృషి వికాస్ యోజన పథకాల ద్వారా సేంద్రీయ పంటలు పండించేలా రైతుల్లో చైతన్యాన్ని నింపుతున్నాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా 800 క్లస్టర్లలో రైతులు సేంద్రీయ పంటలు పండిస్తున్నారు" అని అన్నారు. రైతులకు ఉత్తమ మార్కెట్ ధరను కల్పించేలా, ఈ-మార్కెట్ ప్లాట్ ఫాంను ప్రారంభించామని, దీనిద్వారా 585 హోల్ సేల్ మార్కెట్లతో రైతులను అనుసంధానం చేశామని ప్రణబ్ వివరించారు. దీని ద్వారా 'ఒకే రైతు - ఒకే దేశం - ఒకే మార్కెట్' కల సాకారమవుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News