: కంట తడిపెట్టిన లక్ష్మీదేవమ్మ... సర్దిచెప్పిన చంద్రబాబు


ఏపీ రాజకీయాల్లో నిన్న సంచలన ఘటన చోటుచేసుకుంది. విపక్ష పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ... పార్టీ ఫిరాయించేశారు. అధికార టీడీపీలో చేరిపోయారు. విజయవాడ కేంద్రంగా జరిగిన ఈ క్రతువులో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చేరికను... అక్కడి టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జీ, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న చంద్రబాబు పిలుపు మేరకు ఆయన తన అనుచరులతో కలిసి విజయవాడ వెళ్లారు. రామసుబ్బారెడ్డి వెంట ఆయన పెద్దమ్మ (రామసుబ్బారెడ్డి పెదనాన్న, మాజీ మంత్రి శివారెడ్డి సతీమణి) లక్ష్మీదేవమ్మ కూడా చంద్రబాబు వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆది చేరికను అర్థం చేసుకోవాలని, పార్టీ అభివృద్ధి దృష్ట్యా ఈ చేరిక అవసరమని కూడా చంద్రబాబు వారికి నచ్చజెప్పే యత్నం చేశారు. అయితే ఆది చేరికను తీవ్రంగా వ్యతిరేకించిన లక్ష్మీదేవమ్మ ఒక్కసారిగా ఆవేదనకు గురయ్యారు. ‘‘టీడీపీ కోసం మా కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది. రాజకీయ పోరాటంలో నా భర్తను కోల్పోయాను. మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బందులపాల్జేసిన వారిని ఇప్పుడు పార్టీలోకి ఆహ్వానించడం ఎంతవరకు న్యాయం?’’ అని ఆమె చంద్రబాబును నిలదీశారు. ఈ క్రమంలోనే కాస్తంత ఉద్వేగానికి గురై ఆమె కంట తడిపెట్టారు. ఆ తర్వాత చంద్రబాబు సర్దిచెప్పిన తీరుతో ఒకింత అయిష్టంగానే రామసుబ్బారెడ్డి, లక్ష్మీదేవమ్మలు... ఆది చేరికకు సరేనంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

  • Loading...

More Telugu News