: అధికారంలోకి వస్తే... చంద్రబాబును జైలుకు పంపుతా: వైగో సంచలన వ్యాఖ్య
తమిళనాట తాము అధికారంలోకి వస్తే... టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని జైలుకు పంపుతామని ఎండీఎంకే పార్టీ నేత వైగో నిన్న సంచలన వ్యాఖ్య చేశారు. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు ఆ రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో నిన్న ఆ రాష్ట్రంలోని కరూర్ లో జరిగిన ప్రచారంలో వైగో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల తిరుపతి సమీపంలో జరిగిన తమిళ కూలీల ఎన్ కౌంటర్ ను ప్రస్తావించారు. ఎర్రచందనం కూలీల పేరిట 20 మంది అమాయక తమిళ కూలీలను చంద్రబాబు ప్రభుత్వం ఎన్ కౌంటర్ చేసిందని ఆయన ఆరోపించారు. ఎన్ కౌంటర్ పేరిట తమిళులను చంపేసిన ఏపీ సీఎం చంద్రబాబును... తాము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా జైలుకు పంపుతామని ఆయన సంచలన ప్రకటన చేశారు.