: లెజెండ్స్ తో కలిసి ఢాకా వెళ్తున్నా: కోహ్లీ
లెజెండ్స్ తో కలిసి ఢాకా వెళ్తున్నానంటూ టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్లో పోస్టుతో పాటు, ధోనీ, యువీతో కలిసి ఉన్న ఫోటోను కూడా పెట్టాడు. అనుష్క శర్మతో ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడంతో కోహ్లీ ఆస్ట్రేలియా సిరీస్ తరువాత విశ్రాంతి తీసుకున్నాడు. కుటుంబంతో కలిసి పంజాబ్ లోని అమృత్ సర్, వాఘా బోర్డర్ వంటి ప్రాంతాలకు వెళ్లాడు. అనంతరం ఆసియాకప్ ఆడనున్న భారత జట్టుతో కలిసి, బంగ్లాదేశ్ కు బయల్దేరాడు. ఈ సందర్భంగా విమానంలో ధోనీ, యువరాజ్ సింగ్ మధ్య కూర్చున్న కోహ్లీ, ఓ సెల్ఫీని తీసుకుని, 'లెజెండ్స్ తో ఢాకా' అంటూ ట్విట్టర్లో పోస్టు చేశాడు. దీనికి ఈ ముగ్గురి అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కాగా, ఆసియా కప్ లో భాగంగా బుధవారం భారత జట్టు తొలి టీట్వంటీని ఆడనున్న సంగతి తెలిసిందే.