: పాలనపై పట్టు తప్పింది...నిజాన్ని అంగీకరించిన చంద్రబాబు?
విభజన వల్ల ఏర్పడిన సమస్యలు, ఉద్యోగులు ఒకచోట, పాలన మరో చోట కేంద్రంగా సాగడం వంటి కారణాలతో తాను పట్టును కోల్పోయానని చంద్రబాబు స్వయంగా అంగీకరించారట. ప్రతి రెండువారాలకూ ఒకసారి జరిగే మంత్రివర్గ సమావేశం నేడు ఉదయం జరుగగా, సమావేశం వాడివేడిగా సాగిందని, మంత్రులు తమ మనసులోని అభిప్రాయాలను బాహాటంగానే వెల్లడించారని తెలుస్తోంది. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందన్న భావన ప్రజల్లో పెరుగుతోందని, ముఖ్యమంత్రి దానికి అడ్డుకట్ట వేయలేక పోతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారని ఓ మంత్రి అనగా, చంద్రబాబు సైతం ఆ అభిప్రాయంతో ఏకీభవించినట్టు సమాచారం. ఒక దశలో సహనం కోల్పోయిన చంద్రబాబు, జూన్ తరువాత తన పాలన ఎలా ఉంటుందో చూపిస్తానని తీవ్ర స్వరంతో చెప్పినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగులు రావాల్సిందేనని, అందుకు ప్రత్యామ్నాయం కూడా లేదని బాబు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. రేపు కలెక్టర్ల సమావేశం ముగిసిన తరువాత తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మాదిరిగా, విజయవాడ బందరు రోడ్డులో ఓ భవనాన్ని వెతికి, అందులో పార్టీ ఆఫీస్ పెట్టాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ లను చంద్రబాబు ఆదేశించినట్టు తెలిసింది.