: భూమా మనసులో ఏముంది? రాజీనామాపై కొనసాగుతున్న సస్పెన్స్!
వైకాపా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఈ ఉదయం పీఏసీ సమావేశం అనంతరం ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయానికి అందించారని కమిటీ సభ్యులు మీడియాకు ఉప్పందించగా, ఆపై బయటకు వచ్చిన అనంతరం భూమా మాత్రం, ఏ విషయాన్నీ స్పష్టంగా వెల్లడించకుండా వెళ్లిపోయారు. "సమయం వచ్చినప్పుడు చెబుతాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పటి వరకూ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. సరైన సమయం కోసం వేచిచూస్తున్నా. ఏం చేసినా మీకు చెప్పే చేస్తాను. ప్లీజ్..." అంటూ వెళ్లిపోయారు. పీఏసీ విషయంలోనూ ఆయన సమాధానాన్ని దాటవేశారు. దీంతో ఆయన పీఏసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారా? లేదా? అన్న విషయంలో స్పష్టత కొరవడింది. ఇక మరోవైపు కర్నూలు జిల్లాలో తెలుగుదేశం ప్రధాన నేతలుగా ఉన్న శిల్పా సోదరులతో చంద్రబాబు మరికాసేపట్లో ప్రత్యేకంగా సమావేశం కానున్న నేపథ్యంలో సస్పెన్స్ మరింతగా పెరిగింది.