: టీడీపీలో భూమా చేరిక ఖరారు?... శిల్పా సోదరులకు చంద్రబాబు పిలుపు
టీడీపీ ప్రారంభించిన ‘ఆకర్ష్’ పథకంలో మరింత వేగం పెరిగిందనే చెప్పాలి. ప్రస్తుతం కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఉన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి నుంచి కర్నూలు జిల్లా నంద్యాల పార్టీ నేతలు శిల్పా సోదరులకు పిలుపు వచ్చింది. ఉన్నపళంగా విజయవాడ వచ్చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి, ఆయన సోదరుడు, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిలకు చంద్రబాబు కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. దీంతో శిల్పా బద్రర్స్ హుటాహుటిన విజయవాడ బయలుదేరారు. వైసీపీ కీలక నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియలను పార్టీలో చేర్చుకునే విషయంపై సంప్రదింపులు జరిపేందుకే శిల్పా బ్రదర్స్ కు చంద్రబాబు కార్యాలయం నుంచి ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నిన్నటిదాకా భూమా చేరికపై కాస్తంత డైలమా నెలకొన్నా, శిల్పా బ్రదర్స్ కు చంద్రబాబు ఆఫీస్ నుంచి ఫోన్ తో భూమా చేరిక ఇక లాంఛనమేనన్న వాదన వినిపిస్తోంది.