: జేఎన్ యూలో హైటెన్షన్... వర్సిటీకి వచ్చిన ఉమర్ ఖలీద్ సహా ఐదుగురు ‘రాజద్రోహ’ విద్యార్థులు


వరుస ఆందోళనలు, అరెస్టులతో అట్టుడికిన ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నేడు మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయి. భారత పార్లమెంటుపై జరిగిన దాడి కేసులో ఉరిశిక్షకు గురైన అఫ్జల్ గురుకు అనుకూలంగా ర్యాలీ తీయడమే కాక దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆరుగురు విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు రాజద్రోహం కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో వర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేయగా, మిగిలిన ఐదుగురు విద్యార్థులు వర్సిటీ వీడి పరారైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఐదుగురు తిరిగి వర్సిటీలోకి వచ్చేశారు. వీరిలో సిమి మాజీ చీఫ్ కుమారుడు ఉమర్ ఖలీద్ కూడా ఉన్నాడు. ఉమర్ ఖలీద్ కోసం నిన్నటిదాకా పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. అయితే పోలీసులకు చిక్కని ఖలీద్... మిగిలిన నలుగురు నిందితులతో కలిసి వర్సిటీలో అడుగుపెట్టాడు. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు వారిని అరెస్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు వారు వర్సిటీ వీసీ నుంచి అనుమతి కోరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అరెస్టులను వ్యతిరేకిస్తున్న ఖలీద్ అండ్ బ్యాచ్ తాము కోర్టులో లొంగిపోతామని చెబుతోంది. ఈ క్రమంలో వర్సిటీలో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు తప్పేలా లేవన్న వాదన వినిస్తోంది.

  • Loading...

More Telugu News