: ప్రారంభం కాకుండానే కాలిబూడిదైన జువెలరీ షాప్... భారీగా ఆస్తి నష్టం
హైదరాబాదులోని అమీర్ పేటలో నేటి తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నేడో, రేపో పసిడి విక్రయదారులను ఇట్టే ఆకట్టుకునేందుకు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న జువెలరీ షాపు తగలబడిపోయింది. వెరసి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్లు సమాచారం. అమీర్ పేటలోని గురుద్వారా సమీపంలో కొత్తగా వాణిజ్య కార్యకలాపాలు సాగించేందుకు ఓ జువెలరీ షాప్ దాదాపుగా సిద్ధమైంది. ఈ క్రమంలో నేటి తెల్లవారుజామున ఉన్నట్టుండి సదరు షాపులో మంటలు చెలరేగాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునేలోగానే షాపు మొత్తం తగలబడిపోయింది. త్వరలో జరగనున్న ప్రారంభోత్సవం నేపథ్యంలో భారీ ఎత్తున సేకరించిన నగలన్నీ ఈ ప్రమాదంలో కాలి బూడిదైనట్లు సమాచారం.