: ఏపీ ఆర్టీసీలో వెనుక సీట్లకు 20 శాతం రాయితీ!
ఇకపై ఆర్టీసీ బస్సుల్లో వెనుక సీట్లను ఎంచుకుంటే, మీకు తప్పనిసరిగా 20 శాతం రాయితీతో టికెట్ లభిస్తుంది. బస్సులో ఆఖరి వరుసలోని ఐదు సీట్లు, వాటి ముందున్న వరుసలోని నాలుగు సీట్లకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. ఇప్పటిదాకా ఈ సీట్లలో ప్రయాణించాలంటే ముఖం చాటేయడం, ఇంకో బస్సు కోసం వేచి చూడటం మనందరం చేస్తున్నదే. దీంతో చాలా బస్సులు పూర్తిగా నిండకుండానే గమ్యస్థానాలకు బయలుదేరుతున్నాయి. ఫలితంగా ఆక్యుపెన్సీ రేషియో తగ్గడమే కాక ఆర్టీసీకి భారీ నష్టాలు వస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర విభజన తర్వాత సింగిల్ గా ప్రయాణం ప్రారంభించిన ఏపీఎస్ఆర్టీసీ ఈ మేరకు కొన్ని వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. సదరు చర్యల్లో ‘వెనుక సీట్ల బుకింగ్ కు 20 శాతం రాయితీ’ కూడా ఒకటని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సాంబశివరావు నిన్న విజయవాడలో ప్రకటించారు.