: బౌన్సర్ గండం.. క్రీజ్ లో కూలపడ్డ ఆస్ట్రేలియా కెప్టెన్!
క్రైస్ట్ చర్చ్ వేదికగా న్యూజిలాండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో అపశృతి చోటుచేసుకుంది. ఫాస్ట్ బౌలర్ వాగ్నర్ బౌన్సర్ వేయడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ హెల్మెట్ కు అది బలంగా తాకింది. బౌన్సర్ బంతి తనకు తగిలే ప్రమాదముందని ముందుగానే ఊహించిన స్మిత్ కిందకు వంగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తలకు బంతి బలంగా తగలడంతో స్మిత్ క్రీజ్ లోనే కూలబడ్డాడు. వెంటనే అక్కడికి వచ్చిన వైద్యులు పరీక్షించి, హెల్మెట్ ఉండటంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. కొద్ది నిమిషాలకు తేరుకున్న స్మిత్ తిరిగి బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ సందర్భంగా బౌలర్ వార్నర్ మాట్లాడుతూ, ఈ సంఘటన జరిగిన వెంటనే స్మిత్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లానని.. కొద్దిగా కళ్లు తెరిచి చూశాడని చెప్పాడు. కాగా, నిన్న ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్ లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 370 పరుగులకు ఆలౌటయింది. నేడు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు కోల్పోయి 364 పరుగులు చేసింది.