: ఛత్తీస్ గఢ్ లో ఆప్ మహిళా నేతపై యాసిడ్ దాడి... నిందితులపై కఠిన చర్యలకు కేజ్రీ డిమాండ్
మావోయిస్టుల వరుస దాడులతో నిత్యం రావణ కాష్టంలా రగులుతున్న ఛత్తీస్ గఢ్ లో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత మరో ఘోరం చోటుచేసుకుంది. సామాజిక ఉద్యమకర్త, ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా నేత సోని సోరిపై గుర్తు తెలియని దుండగులు యాసిడ్ దాడి చేశారు. ఏదో పని నిమిత్తం ఛత్తీస్ గఢ్ లోని మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న దంతెవాడ జిల్లాకు వెళ్లి తిరిగివస్తున్న క్రమంలో సోని సోరి కారును బైక్ పై వచ్చిన ముగ్గురు దుండగులు అడ్డగించారు. ఈ క్రమంలో కారు దిగిన వెంటనే సోనిసోరిపై దుండగులు యాసిడ్ లాంటి ద్రావణాన్ని చల్లారు. ఈ దాడిలో ఆమెకు పెద్దగా గాయాలేమీ కాకున్నా ముఖమంతా మంట పుట్టిందట. దాడి చేసిన మరుక్షణమే దుండగులు వచ్చిన బైక్ పైనే పారిపోగా, సోని సోరిని ఆమె అనుచరులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. నిందితులపై ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎందుకిలా జరుగుతోందంటూ ఆయన ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేశారు.