: జాట్ ల ఆందోళన ఎఫెక్ట్!... ఢిల్లీకి నిలిచిన నీరు, నిత్యావసరాల సరఫరా


రిజర్వేషన్ల కోసం హర్యానాలో కొనసాగుతున్న జాట్ ల ఆందోళన హింసాత్మకంగా మారింది. జాట్ ల మెరుపు ఆందోళనతో హర్యానా సర్కారు దిగివచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. సాక్షాత్తు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ జాట్ ల ఆందోళనపై స్పందించారు. ‘మీ డిమాండ్లను నెరవేరుస్తాం... ఆందోళన విరమించండి’ అని ఖట్టర్ ప్రకటించినా, జాట్లు ససేమిరా అంటున్నారు. సీఎం హామీలో స్పష్టత కనిపించడం లేదని చెబుతున్న జాట్లు... తమకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేస్తేనే ఆందోళన విరమిస్తామని ప్రకటించారు. ఆందోళనల్లో భాగంగా శనివారం మరింత రెచ్చిపోయిన జాట్లు... ఢిల్లీ తాగు నీటి అవసరాలకు ప్రధానాధారంగా ఉన్న మ్యూనక్ కాల్వ గేట్లను బద్దలు కొట్టారు. దీంతో ఢిల్లీకి జల రవాణా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం గేట్లు బద్దలు కావడంతో మ్యూనక్ కాల్వ నుంచి వృథాగా పోతున్న నీటికి అడ్డుకట్ట వేయడం అధికార యంత్రాంగానికి సాధ్యం కావడం లేదు. దీంతో ఒకటి, రెండు రోజుల్లో ఢిల్లీ ప్రజలు తీవ్ర తాగు నీటి ఎద్దడిని ఎదుర్కోక తప్పదన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో నిన్న ఢిల్లీ జల బోర్డు అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. పొంచి ఉన్న తాగు నీటి ఎద్దడి ముప్పు నుంచి తప్పించుకునేదెలాగా? అంటూ బోర్డు తల పట్టుకుంది. ఇక హర్యానా నుంచి ఢిల్లీకి వెళ్లే అన్ని రోడ్లను జాట్లు దిగ్బంధించారు. దీంతో హర్యానా నుంచి ఢిల్లీకి వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఢిల్లీ ప్రజలకు అవసరమయ్యే నిత్యావసరాలు ప్రధానంగా హర్యానా నుంచే సరఫరా అవుతున్నాయి. వాహనాల రాకపోకలు నిలిచిన నేపథ్యంలో ఢిల్లీలో నిత్యావసరాలు... ప్రధానంగా కూరగాయలు దొరకడం లేదు. అరకొరగా దొరుకుతున్నా ధరలు మండిపోతున్నాయి. దీంతో జాట్ల డిమాండ్లపై కేంద్రం కూడా దృష్టి సారించక తప్పని పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News