: టాలీవుడ్ మరో విషాదం... గుండెపోటుతో ప్రదీప్ శక్తి హఠాన్మరణం
తెలుగు చిత్ర సీమ ‘టాలీవుడ్’ మరో నటుడిని కోల్పోయింది. ఇటీవలి టాలీవుడ్ హిట్ మూవీ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’లో నటించిన సీనియర్ నటుడు ప్రదీప్ శక్తి శనివారం రాత్రి కన్నుమూశారు. అమెరికాలోని న్యూజెర్సీలో శనివారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన ఆయన హఠాన్మరణం చెందారు. కమలహాసన్ లీడ్ రోల్ లో వచ్చిన ‘నాయకుడు’ చిత్రంలో క్రూరమైన పోలీసు అధికారి పాత్రలో నటించిన ప్రదీప్ శక్తి... తనదైన శైలిలో సత్తా చాటారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఆయన ప్రతినాయకుడిగానే తెలుగు ప్రేక్షకులకు చిర పరచితులు. గుంటూరుకు చెందిన వాసిరెడ్డి ప్రదీప్ శక్తి... ‘లేడీస్ టైలర్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి సొంత పేరుతోనే స్థిరపడిపోయారు. తెలుగుతో పాటు దక్షిణాది భాషా చిత్రాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ శక్తి చాలా కాలం క్రితమే అమెరికాలోని న్యూజెర్సీకి వలస వెళ్లారు. ‘బాబా హట్’ పేరిట అక్కడ ఓ హోటల్ ను ఏర్పాటు చేసిన ఆయన అక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. ప్రదీప్ శక్తికి భార్య, ఓ కూతురు ఉన్నారు. చాలాకాలం పాటు నటనకు దూరంగా ఉన్న ప్రదీప్ శక్తి... విక్టరీ వెంకటేశ్ చిత్రం ‘చింతకాయల రవి’తో రీఎంట్రీ ఇచ్చారు. ఆయన హఠాన్మరణం పట్ల తెలుగు చిత్రసీమ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.