: కుమార్తె పెళ్లికి రెండు రోజులు పాటు స్కూలుకి సెలవు ప్రకటించిన హెచ్ఎం
ఓ హెడ్ మిస్ట్రెస్ తాను పనిచేస్తున్న స్కూలుకి రెండు రోజుల పాటు అనధికార సెలవులు ప్రకటించి వార్తల్లో నిలిచింది. తమిళనాడులోని పుక్కుంపట్టిలోని ప్రాథమిక పాఠశాలలో తమిళసెల్వి ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తోంది. ఈ నెల 17, 18 తేదీల్లో ఆమె తన కుమార్తె వివాహాన్ని చెన్నైలో ఘనంగా జరిపింది. దీంతో వ్యక్తిగతంగా సెలవు పెట్టుకుని, వివాహ పనులు చూసుకోవాల్సిన ఆమె ఆ పనిచేయకుండా స్కూలుకి సెలవు ప్రకటించింది. అందుకు ఓ కారణాన్ని కూడా సృష్టించింది. ఆ గ్రామంలో సంప్రదాయబద్ధమైన ఓ పండుగను రెండు రోజుల పాటు జరుపుకుంటారని 'దొంగ పండుగ'ను సృష్టించి రికార్డులలో రాసి, ఆప్షనల్ హాలీడేస్ ను ప్రకటించింది. దీంతో ఒకేసారి రెండు రోజుల పాటు పిల్లలకు సెలవు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు అనుమానం వచ్చి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. అసలు ఆ పండుగే తమకు తెలియదని వారు స్పష్టం చేశారు. దీంతో హెచ్ఎం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని గుర్తించిన విద్యాశాఖ ఉన్నతాధికారులు దీనిపై సమగ్రసమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు.