: హైదరాబాదులో మరో నాలుగు వెయ్యి పడకల ఆసుపత్రులు నిర్మిస్తాం: సీఎం కేసీఆర్
హైదరాబాదులో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల మాదిరిగా మరో నాలుగు వెయ్యి పడకల ఆసుపత్రులను నిర్మిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. అందుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలని వైద్య శాఖ అధికారులను ఆయన ఆదేశించారు ఉప్పల్-ఎల్బీనగర్, మల్కాజ్ గిరి- కంటోన్మెంట్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో ఈ ఆసుపత్రులు నిర్మిస్తామన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో బాటు, ఇతర అధికారులతో వైద్య, ఆరోగ్య శాఖ బడ్జెట్ పై సీఎం ఈరోజు క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రైవేటు వైద్యశాలలకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగ్గా తయారవ్వాలన్న సీఎం, ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేసేందుకు ఎన్ని నిధులైనా విడుదల చేస్తామని చెప్పారు. అంతేగాక గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్య సిబ్బందికి అదనపు వేతనం చెల్లిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రజావైద్యం అమలుపై అధ్యయనానికి మంత్రుల బృందం తమిళనాడును సందర్శించాలన్నారు. 108, 104 సేవలను మరింత బలోపేతం చేసేందుకు అనువైన విధానాన్ని రూపొందిస్తామని, హైవేలపై పెట్రోలింగ్ వాహనాలకు 108, 104 లను అనుసంధానం చేస్తామని తెలిపారు.