: పెళ్లికొడుకును అరెస్ట్ చేసిన పోలీసులు...ధన్యవాదాలు చెప్పిన పెళ్లికూతురు!
సాధారణంగా మన సినిమాల్లో పెళ్లికొడుకు తాళి కడుతున్న సమయంలో పోలీసులు రంగప్రవేశం చేసి, 'యూ ఆర్ అండర్ అరెస్ట్' అంటూ సదరు పెళ్లికొడుకుని పట్టుకుపోవడం మనం చూసి ఎంజాయ్ చేస్తుంటాం. అచ్చం అలాంటి ఘటనే పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం నాగళ్లదిబ్బ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన సోమరాజు చాలా కాలంగా హెచ్ఐవీతో బాధపడుతున్నాడు. ఈ విషయం దాచిపెట్టి చెరువు గ్రామానికి చెందిన యువతిని ఈ నెల 16న వివాహం చేసుకున్నాడు. దీంతో పెద్దలు 18న ఆ దంపతులకు శోభనం నిర్ణయించారు. అంతా సిద్ధమైంది. ఇంతలో విషయం తెలుసుకున్న స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు సకాలంలో స్పందించి సోమరాజును అదుపులోకి తీసుకుని, ఆమెకు అసలు విషయం వివరించారు. దీంతో కొత్తపెళ్లికూతురు, ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.