: మాటమారింది... చూపించింది శాంపిల్ మాత్రమే: రింగింగ్ బెల్స్
'ఫ్రీడమ్ 251' పేరిట స్మార్ట్ ఫోన్ ను రూ. 251కే అందిస్తామని ప్రకటించి సంచలనం రేపిన రింగింగ్ బెల్స్ సంస్థ మాటమార్చింది. ఫోన్ ఆవిష్కరణ రోజున తాము చూపించింది కేవలం శాంపిల్ ఫోన్ మాత్రమేనని సంస్థ ప్రెసిడెంట్ అశోక్ చద్దా వ్యాఖ్యానించారు. వాస్తవంగా డెలివరీ అయ్యే ఫోన్ అవే రకమైన ఫీచర్లతో ఉంటుందని చెప్పారు. డెలివరీ అయ్యే ఫోన్ గురించిన మరింత సమాచారం వెల్లడించని ఆయన, ఈ ఫోన్ల తయారీ కోసం రూ. 250 కోట్లతో రెండు మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ఏప్రిల్ 10 నుంచి డెలివరీలను మొదలు పెడతామని, జూన్ 30లోగా సాధ్యమైనన్ని ఎక్కువ ఫోన్లు అందిస్తామని తెలిపారు. 5 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్స్ జరిగాయని, జూన్ 30 లోగా సాధ్యమైనన్ని ఎక్కువ ఫోన్లు అందించేందుకు కృషి చేస్తామని, 'తొలుత వచ్చిన వారికి తొలుత' ప్రాతిపదికన డెలివరీలు ఇస్తామని వివరించారు.