: బడ్జెట్ హల్వా పంపిణీ చేసిన అరుణ్ జైట్లీ
బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ భవనం నార్త్ బ్లాక్ లో బడ్జెట్-2016 ప్రతుల ముద్రణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా బడ్జెట్ తయారీలో పాల్గొనే ఉద్యోగులు అక్కడ హల్వా వేడుక చేసుకోవడం ఆనవాయతీ. ఈ వేడుకలో తయారు చేసిన హల్వాను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, సహాయ మంత్రి జయంత్ సిన్హా స్వహస్తాలతో పంపిణీ చేశారు. బడ్జెట్ తయారీలో పాల్గొనే ఉద్యోగులు నేటి నుంచి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టేవరకు ఇళ్లకు వెళ్లే అవకాశం ఉండదని తెలిసిందే. కొందరు అత్యున్నత స్థాయి ఉద్యోగులకు మాత్రం ఇంటికి వెళ్లే వెసులుబాటు ఉంది. బడ్జెట్ తయారీలో పని చేసే ఉద్యోగులు సెల్ ఫోన్లు, మెయిల్స్, సామాజిక మాధ్యమాలు వినియోగించడం నిషేధం. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా విధుల్లో నిమగ్నమై ఉంటారు. బడ్జెట్ విషయంలో ప్రభుత్వం అంతటి గోప్యతను పాటిస్తుంది.