: ఆరు దశాబ్దాల తరువాత కాంగ్రెస్ కు గుర్తొచ్చిన 'ఆంధ్రరత్న'!
విజయవాడ నడిబొడ్డున ఉన్న 'ఆంధ్రరత్న' భవనం. స్వాంతంత్ర్య సంగ్రామ సమయంలో ఎన్నో చర్చలు జరిగిన వేదిక. దక్షిణాదిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలెందరికో ఆతిథ్యమిచ్చిన భవంతి. ఎన్నో సత్యాగ్రహాలు ఆంధ్రరత్న భవనం నాలుగ్గోడల మధ్య జరిగాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తరువాత నెమ్మదిగా ప్రాభవం కోల్పోయి పాడుబడిన ఈ భవనానికి తిరిగి మహర్దశ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అధికార కార్యాలయమే లేకపోగా, తిరిగి ఆంధ్రరత్న భవనమే వారికి దిక్కయింది. వాస్తవానికి ఈ భవనానికి ఘనమైన చరిత్రే ఉంది. దాదాపు 98 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న వేళ, తమిళనాడు, ఏపీల కాంగ్రెస్ కార్యాలయం ఒక భవనంలో అప్పటి మద్రాసులో ఉండేది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు ఏర్పడిన తరువాత విజయవాడ కేంద్రంగా తెలుగు కమిటీ 1929లో ఈ భవనాన్ని నిర్మించుకుంది. ఇదే భవనం వేదికగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. స్వాతంత్య్ర సంగ్రామ నేత, కవి, పాటల రచయిత దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరిట ఆయనకున్న 'ఆంధ్రరత్న' బిరుదునే ఈ భవంతికి పేరుగా పెట్టారు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏపీపీసీసీ కార్యాలయం హైదరాబాద్ కు మారింది. అప్పటి నుంచి రాష్ట్రం విడిపోయే వరకూ నాంపల్లిలోని గాంధీభవన్ కేంద్రంగానే కాంగ్రెస్ పనులు సాగాయి. ఇక వర్తమానానికి వస్తే, విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఓ కుటుంబం అద్దెకుంటుండగా, పైనున్న హాల్ లో అప్పుడప్పుడూ సమావేశాలు జరుగుతుండేవి. కిందున్న వారిని ఖాళీ చేయించడంలో సఫలమైన కాంగ్రెస్ పెద్దలు, ఈ భవనానికి మెరుగులు దిద్ది పైన మరో ఫ్లోర్ వేయించారు. గ్రౌండ్ ఫ్లోర్ లో వివిధ గదులను ఏర్పాటు చేశారు. పాత మెట్లు తొలగించి కొత్తవాటిని అమర్చారు. వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు స్థలాన్ని సమకూర్చారు. ఇక జూన్ 15 లోగా పరిపాలన అమరావతి నుంచే సాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ సైతం ఇక్కడే అధికార కార్యాలయం ఉండాలన్న ఉద్దేశంతో ఈ భవనాన్ని వాడుకోనున్నట్టు రఘువీరారెడ్డి తెలిపారు. అంటే, దాదాపు ఆరు దశాబ్దాల తరువాత కాంగ్రెస్ పార్టీకి ఈ భవంతి గుర్తుకొచ్చింది. ఇకనైనా చరిత్రకు ఆనవాలుగా నిలిచివున్న 'ఆంధ్రరత్న' మరో వెలుగు వెలుగుతుందని ఆశిద్దాం.