: వైసీపీ ఎమ్మెల్యే రోజాపై కఠిన చర్యలే?... వీడియోను పరిశీలిస్తున్న నిజ నిర్ధారణ కమిటీ
ఇటీవలి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ కోడెల శివప్రసాద్ సహా సీఎం నారా చంద్రబాబునాయుడు, అధికార పార్టీ సభ్యులపై ఘాటు వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడింది. అయితే తన సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తున్న రోజా, హైకోర్టునూ ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈ విషయంపై మరింత లోతుగా దర్యాప్తు సాగించేందుకే ప్రభుత్వం మొగ్గుచూపింది. అంతేకాక మహిళా సభ్యురాలిగా ఉంటూ అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన రోజాపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అధికార పార్టీ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నియమించిన నిజ నిర్ధారణ కమిటీ కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని అసెంబ్లీలో మరోమారు సమావేశమైంది. ఈ సందర్భంగా నాటి అసెంబ్లీ సమావేశాల వీడియోలను కమిటీ పరిశీలించనున్నట్లు సమాచారం. సదరు వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత రోజా వ్యవహారంపై కమిటీ ప్రభుత్వానికి ఓ నివేదికను అందజేయనుంది. ఈ నివేదిక ఆధారంగా రోజా సస్పెన్షన్ కాల పరిమితిని కుదించాలా? పొడిగించాలా? లేక రద్దు చేయాలా? అన్న విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ క్రమంలో కమిటీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.