: రాజధాని ‘రియల్ బూం’పై చంద్రబాబు అసహనం... ధరలు తగ్గించకపోతే పరిశ్రమలు రావని కామెంట్
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ తన నూతన రాజధానిని హైదరాబాదుకు దూరంగా నిర్మించుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామం ప్రభుత్వానికి గుదిబండగా మారగా, గుంటూరు జిల్లా తుళ్లూరు పరిసర ప్రాంతాలు, కృష్ణా జిల్లా విజయవాడ పరిసర వాసులకు అయాచిత వరంగా మారింది. ఈ క్రమంలో ఆ ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చేశాయి. అప్పటిదాకా ఎకరం రూ.10 లక్షలు కూడా పలకని ధర నవ్యాంధ్ర నూతన రాజధాని పుణ్యమా అని కోటి రూపాయలు దాటేసింది. ఈ క్రమంలో నేటి ఉదయం విజయవాడ పరిధిలోని తాడిగడపలో ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... దిగిరాని రియల్ ధరలపై అసహనానికి గురయ్యారు. తక్షణమే ధరలు తగ్గని పక్షంలో ఇప్పటిదాకా నవ్యాంధ్రకు వస్తామని ప్రమాణం చేసిన కంపెనీలు కూడా ఇతర ప్రాంతాలకు తరలిపోవడం ఖాయమని ఆయన వాపోయారు.