: 88 ఏళ్ల తరువాత క్యూబాలో అమెరికా అధ్యక్షుడి పర్యటన!
అగ్రరాజ్యం అమెరికా, క్యూబా మధ్య స్నేహ సంబంధాలు చిగురిస్తున్నాయి. ఆగర్భ శత్రువుల్లా ఉన్న ఇరు దేశాల మధ్య త్వరలో స్నేహసౌరభం పరిమళించనుంది. దాదాపు 88 సంవత్సరాల తరువాత క్యూబాలో ఓ అమెరికా అధ్యక్షుడు పర్యటించబోతున్నారు. మార్చి 21, 22 తేదీల్లో అధ్యక్షుడు ఒబామా తన సతీమణి మిషెల్లితో కలిసి ఆ దేశంలో పర్యటించనున్నట్టు వైట్ హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు రెండు దేశాల మధ్య శాంతి, సుహృద్భావం పెంపొందించేందుకు క్యూబాకు వెళతానని 14 నెలల కిందటే చెప్పానంటూ ఒబామా ట్విట్టర్ లో తెలిపారు. అందుకు తగిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, సుదీర్ఘకాలం తరువాత క్యాస్ట్రో గడ్డలోని దౌత్యకార్యాలయంపై అమెరికా జెండా ఎగరడాన్ని చూడాలని తన మనస్సు ఉవ్విళ్లూరుతోందని పేర్కొన్నారు. చివరిసారిగా 1928లో ఒక అమెరికా అధ్యక్షుడు క్యూబాలో పర్యటించారు. మళ్లీ ఐదున్నర దశాబ్దాల తరువాత క్యూబాలో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడిగా ఒబామా పేరు చరిత్రలో నిలిచిపోనుంది. తన పర్యటనతో అమెరికా, క్యూబా మధ్య పూర్తిస్థాయి శాంతి, స్నేహ సంబంధాలు పునరుద్ధరణవుతాయని, మరింతమంది యూఎస్ పర్యాటకులు ఆ దేశానికి వెళతారని ఒబామా ఆశాభావం వ్యక్తం చేశారు. అటు క్యూబా అభ్యున్నతికి కూడా అమెరికా తోడ్పడుతుందని అన్నారు.