: అది నా మూడో బిడ్డతో సమానం: వెంకయ్య నాయుడు
స్వర్ణభారతి ట్రస్టు తనకు మూడో బిడ్డతో సమానమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అభివర్ణించారు. కృష్ణా జిల్లా అతుకూరు స్వర్ణ భారతి ట్రస్ట్ లో వృత్తి శిక్షణ కేంద్రం భవనానికి ఈరోజు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, గుప్తుల కాలంలో భారత్ లో స్వర్ణయుగం నడిచిందని, మళ్లీ అలాంటి దేశాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతోనే స్వర్ణభారత్ ట్రస్ట్ ను ప్రారంభించామన్నారు. ప్రభుత్వ సాయం లేకుండా 15 ఏళ్లలో పది లక్షల మందికి శిక్షణ ఇచ్చామని, మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని వెంకయ్య పేర్కొన్నారు. ప్రతిభ పేరుతో అబ్దుల్ కలాం వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం స్థాపించామని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు, స్వర్ణ భారతి ఆరోగ్య కేంద్రం, గ్రామీణ శిక్షణ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.