: పొగాకుపై మరింత పాపపు పన్ను!
కేంద్ర ప్రభుత్వానికి అదనంగా ఆదాయం సమకూర్చుకోవాలన్న భావన వచ్చినప్పుడల్లా కనిపించే వాటిల్లో ముందు నిలిచేది సిగరెట్లు, మద్యం ఉత్పత్తులేనన్న సంగతి అందరికీ తెలిసిందే. అలవాటు పడ్డ ప్రాణాలు ఎంతైనా పెట్టి కొనేస్తారని భావించే కేంద్రం వాటిపై ఇబ్బడిముబ్బడిగా పన్నులు పెంచుకుంటూ వెళుతుంటుంది. ఇక ఈ సంవత్సరపు బడ్జెట్ లోనూ సిగరెట్లపై మోత తప్పేలా లేదు. పొగాకు ఉత్పత్తులపై 40 శాతం పాపపు పన్ను (సిన్ టాక్స్) పెంచాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి ఆర్థిక శాఖకు సిఫార్సులు వెళ్లినట్టు తెలుస్తోంది. అన్ని రకాల పొగాకు ఉత్పత్తులపైనా పన్ను భారం పెంచాలని ఆర్థిక శాఖ ఇప్పటికే ఓ అంచనాకు రాగా, తాజాగా, ఆరోగ్య శాఖ సైతం దాన్నే సిఫార్సు చేయడం గమనార్హం. మరోవైపు ప్రజల్లో వస్తున్న చైతన్యం పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడుతున్న వారి సంఖ్యను తగ్గిస్తున్నట్టు గణాంకాలు వెల్లడిస్తుండటంతో, ఆ మేరకు కేంద్ర ఖజానాకు ఆదాయమూ తగ్గింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-4 ప్రకారం, 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిపిన సర్వేలో పొగాకు వాడకం తగ్గినట్టు తేలింది. తగ్గుతున్న ఆదాయం మరింతగా దిగజారకుండా చూడాలంటే పాపపు పన్ను పెంచాల్సిందేనని కేంద్రం భావిస్తోంది.